Henry Kissinger: ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ కిస్సింజర్ తన 100వ ఏట కన్నుమూశారు. భారత్‌తో అమెరికా బంధాన్ని మరింతగా బలపరుచుకోవాలని కోరుకున్న నేతగా కిస్సింజర్‌కి పేరుంది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ యూఎస్ పర్యటనలో వీల్ చైర్‌లో ఉండీ కూడా కిస్సింజర్ హాజరయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లంచ్‌లో మోడీ స్పీచ్ వినేందుకు ఆయన వచ్చారు. ప్రధాని మోడీతో ముచ్చటించారు.
బుధవారం అమెరికా కనెక్టికట్‌లో ఆయన మరణించారు. వియత్నాం యుద్ధాన్ని అమెరికా ముగించేందుకు సాయం చేసినందుకుగానూ 1973లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. యూఎస్ మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ సమయంలో కమ్యూనిస్ట్ చైనాతో అమెరికా, పాశ్చాత్యదేశాల సంబంధాలు తెరవడానికి 1972లో కిస్సింజర్ ప్రముఖ పాత్ర వహించారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్‌తో అమెరికా సంబంధాలను మెరుగుపరుచుకోవానలి బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇదే కిస్సింజర్ ఇందిరాగాంధీ సమయంలో ఆమె నాయకత్వం పట్ల వ్యతిరేకంగా వ్యవహరించారు. కానీ గత కొన్నేళ్లుగా మోడీ నాయకత్వంలోని భారత్‌తో సంబంధాలకు మద్దతు ఇస్తున్నారు. 1970లో కిస్సింజర్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న సమయంలో భారతదేశంలో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీని తర్వాత ఆయన చైనాకు మద్దతుగా వ్యవహరించడం ప్రారంభించారు. ఇందిరాగాంధీ నాయకత్వంపై కిస్సింజర్ చైనా వైపు మొగ్గు చూపారనే వాదనలు కూడా ఉన్నాయి. 1972 బంగ్లాదేశ్ యుద్ధంలో నిక్సన్‌ని పాకిస్తాన్ వైపు మళ్లేలా ప్రయత్నించారని కొన్ని రహస్య పత్రాలు కిస్సింజర్ గురించి పేర్కొన్నాయి.