ఇరాన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో రక్తసిక్తం అవుతోంది. అధికారికంగా 3 వేల మంది నిరసనకారులు చనిపోయారని చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య 12 వేల మంది వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను అణగదొక్కేందుకు అమెరికా రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తానికి ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులకు దిగబోతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పేరు గల అతి పెద్ద నౌక ఇరాన్ వైపు దూసుకెళ్తోంది. ఇది పూర్తి అణు శక్తితో నడిచే అది పెద్ద వాహన నౌక. కాలిఫోర్నియాలోని నాసా నార్త్ ఐలాండ్‌లో దీని ప్రధాన స్థానం. ఇందులో సూపర్ క్యారియర్, 3-6 డిస్ట్రాయర్లు /క్రూయిజర్లు, 1-2 జలాంతర్గాములు, 7,000-8,000 మంది సైనికులు, 65-70 విమానాలు (F-35, F/A 18 ఉన్నాయి.) వందలాది టోమాహాక్ క్షిపణులు ఉంటాయి. ఇది ఇరాన్ వైమానిక స్థావరాలు, నౌకాదళం, చమురు సౌకర్యాలను దెబ్బతీయగలవు. అంతేకాకుండా అణు స్థావరాలను పూర్తిగా దెబ్బతీయగల సామర్థ్యం దీని సొంతం.

ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వాహన నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి బయల్దేరింది. ఒక వేళ యుద్ధం ప్రారంభిస్తే.. ఇరాన్‌కు భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అమెరికా యుద్ధానికి దిగొచ్చేనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఖతార్‌లో అమెరికా సైన్యం విన్యాసాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ అమెరికా సైనిక విమానాలు మోహరించాయి. ఇంకోవైపు ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక విమాన రాకపోకల్లో అంతరాయం ఏర్పడుతుందని ఎయిరిండియా ప్రయాణికులకు సమాచారం తెలియజేసింది. ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.