USA: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీసీ) సమావేశాలకు ముందు అమెరికాలో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టెలికాం సేవల్ని నిలిసేందుకు పన్నిన కుట్రను యూఎస్ సీక్రెట్ సర్వీస్ మంగళవారం భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా, అనేక దేశాధినేతలు ప్రసంగించే సమయంలో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో తొలి ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది.
యూఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రకారం, అధికారులు అనేక చోట్ల 300 కన్నా ఎక్కువ సిమ్ సర్వర్లు, లక్ష సిమ్ కార్డులను కనుగొన్నారు. న్యూయార్క్‌లో యూఎన్ సమావేశాలు జరగబోయే 56 కిలోమీటర్ల పరిధిలో వీటిని గుర్తించారు. ఈ పరికరాల ద్వారా యూఎస్ అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని టెలిఫోన్ బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పరికరాలను ఉపయోగించి సెల్ టవర్లు పనిచేయకుండా చేసే వీలుందని అధికారులు చెప్పారు.
న్యూయార్క్‌లో సెల్ టవర్లు పనిచేయకుండా చేయడం, టెలికాం సర్వీసులపై దాడులు, విదేశీ శత్రు సంస్థలతో ఎన్‌క్రిప్టెడ్ సంభాషణలు చేయడం వంటి పనులకు ఉపయోగించే టెలికమ్యూనికేషన్ పరికరాలనున అధికారులు గుర్తించి, నిర్వీర్యం చేశారు. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్, న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.