ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సామెతను తీసుకొని మానవ శరీరంలో యాంటీబాడీలను ఏమార్చి ఇన్‌ఫెక్షన్లను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను బోల్తాకొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం కొన్ని లోపాలున్న వైరస్‌ను సృష్టించారు. ఈ లోపాలున్న వైరస్ కరోనా వైరస్ తో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అంతేకాదు, ఆ ప్రక్రియ తరువాత లోపాలున్న కృత్రిమ కరోనా వైరస్ కూడా అంతం అవుతుంది. మానవ శరీర కణాలకు అతుక్కొని అందులోకి జన్యుపదార్ధాన్ని జొప్పించి తనలాంటి వేలాది ప్రతిరూపాలను సృష్టించుకొనే ఈ వైరస్‌కు చెక్ పెట్టేందుకు తయారు చేసిన డీఐ వైరస్ సమర్ధవంతంగా తన పని కానిచ్చేస్తుందని అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కణజాలానికి అతుక్కొని జన్యురాశిని లోనికి పంపి పునరుత్పత్తి చేసే విధానామే కృత్రిమ వైరస్ కూడా చేస్తుంది. కాకుంటే, కృత్రిమ వైరస్ అసలైన కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. కృత్రిమ వైరస్ జన్యుఉత్పత్తి వేగంగా జరగడంతో అసలైన వైరస్ ఉత్పత్తి వేగం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.