Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్‌పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
Read Also: ICC World Cup 2023: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి మ్యాచ్.. చెన్నై వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?
శనివారం హమాస్ ఇజ్రాయిల్ పై మెరుపదాడికి తెగబడింది. 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ఫైర్ చేసింది. గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ నగరాలు, పట్టణాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయిల్ పటిష్ట భద్రత కళ్లుగప్పి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకువచ్చారు. ఇజ్రాయిల్ పౌరులను, సైన్యానికి చెందిన కొందర్ని బందీలుగా చేసుకుని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు.
హమాస్ దాడిలో ఇప్పటి వరకు 300 మంది వరకు ఇజ్రాయిలీలు చంపబడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై జరిపిన దాడిలో 232 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హమాస్ స్థావరాలు, వారికి సాయం చేసిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ వైమానికి దాడులు చేస్తోంది. హమాస్ మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తున్న గాజా నగరాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ ప్రధాని వార్నింగ్ ఇచ్చారు.