రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దండయాత్రను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఇచ్చిన ఈ తీర్పునకు రష్యా కట్టుబడి ఉండాలన్నారు. దీన్ని విస్మరిస్తే రష్యా మరింత ఒంటరవుతుందని హెచ్చరించారు జెలెన్‌స్కీ.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా, ఉక్రెయిన్, రష్యా మధ్య గత మూడు వారాలుగా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి అమెరికా, రష్యా మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటుచేసుకున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివాన్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి జనరల్ నొకోలాయ్ పట్రుషెవ్‌తో మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడిచింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జాక్ తెలిపారు. దౌత్యం గురించి రష్యా సీరియస్‌గా ఉంటే తక్షణమే ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని సూచించినట్టు తెలిపింది. మరోవైపు… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌గా కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన 9/11 దాడులతో పాటు 1941 డిసెంబర్‌లో పెరల్ హార్బర్‌లో జరిగిన బాంబు దాడుల్ని గుర్తుచేశారు. గత మూడు వారాలుగా ఉక్రెయిన్‌లో ప్రతి రోజూ అదే తరహాలో దాడులు జరుగుతున్నట్టు తెలిపారు. ప్రపంచానికి నాయకుడిగా ఉండటమంటే అర్థం శాంతికి నాయకత్వం వహించడమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి అన్నారు. తమ పోరాటం కేవలం ఉక్రెయిన్‌ని మాత్రమే కాపాడుకొనేందుకు కాదనీ.. యూరప్, ప్రపంచ విలువల కోసం పోరాటం చేస్తున్నామన్నారు జెలెన్‌స్కీ.
రష్యా దాడుల కారణంగా పలు నగరాల్లో మిగిలి ఉన్న పౌరుల్ని ఖాళీ చేయించేందుకు వీలుగా తమ దేశంపై నో -ఫ్లై జోన్ ప్రకటించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై 1000కి పైగా మిసైళ్లను పేల్చాయన్నారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని అడగడం ఎక్కువ అనుకుంటే కనీసం ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలైనా అందించాలని అని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా ఓ వైపు దాడులను కొనసాగించడంతో పాటు మరోవైపు కీలక నేతల్ని కిడ్నాప్ చేస్తోంది. రష్యా దురాక్రమణదారులు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ఇప్పటివరకు రష్యా కిడ్నాప్ చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఉక్రెయిన్‌పై ఇంకా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విన్నెట్సియా నగరంపై పుతిన్ సేనలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ టీవీ టవర్ ధ్వంసమైనట్టు విన్నిట్సియా ఒబ్లాస్ట్ గవర్నర్ బోర్జోవ్ వెల్లడించారు.