గాజాను స్వాధీనం చేసుకోవాలన్న తీర్మానానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హమాస్‌ను అంతం చేసి గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని.. దీనిపై వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. గతంలో కూడా కాల్పులు ఆపకపోతే.. పాలస్తీనాకు మద్దతు తెల్పుతామని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. ఈ ప్రకటనను అప్పట్లో నెతన్యాహు ఖండించారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud: వృద్ధుడిపై వలపు వల.. రూ.9 కోట్లు సమర్పయామి
తాజాగా మరోసారి ఇజ్రాయెల్ మంత్రివర్గ నిర్ణాయాన్ని కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. గాజాను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ దాడులు మొదలు పెడితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం అన్నారు. తక్షణమే పునఃపరిశీలించాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్య మరింత వివాదానికి దారి తీస్తుంది తప్ప.. బందీల విడుదలకు సురక్షితం కాదని.. మరింత రక్తపాతం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
గాజా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు 22 నెలలుగా యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొంత మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా కొంత మంది వారి దగ్గరే ఉన్నారు. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది.
ప్రస్తుతం గాజాలో దాదాపు 75 శాతం భూభాగం ఐడీఎఫ్ నియంత్రణలో ఉంది. తాజా ప్రణాళిక ప్రకారం.. మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోనుంది. అయితే దీన్ని ఐడీఎఫ్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళనను వ్యక్తం చేసింది.