పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సిక్కు వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సల్జీత్ సింగ్ (42), రంజీత్ సింగ్ (38) వ్యాపారం చేస్తుంటారు. అయితే.. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తుంటారు. వారిలో అత్యధికులు వ్యాపారులే ఉండగా.. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రవీందర్ సింగ్, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్‌జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ లను కొందరు దుండగులు హత్య చేశారు.
అయితే ఇప్పుడు.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి సల్జీత్ సింగ్, రంజీత్ సింగ్‌లపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనను.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పాటు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు.