Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
ఇప్పటికే ఇజ్రాయిల్ తాత్కాలికంగా దాడులు నిలిపేసిందని, బందీలను హమాస్ త్వరగా విడుదల చేసి, శాంతి ఒప్పందానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు, గాజా ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ తమపై దాడి చేసిందని ఆరోపించింది. ఈ దాడిలో 57 మంది మరణించినట్లు చెప్పింది. బందీల విడుదలపై చర్చలు జరిపేందుకు ట్రంప్ కుమారుడు జరెడ్ కుష్నర్, మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్ట్ వెళ్లుతున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది.
Read Also: TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్‌షాక్.. మరోసారి పెరగనున్న బస్ ఛార్జీలు..
గత రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు ఇవ్వాలని అమెరికా ప్రణాళికపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీలందర్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒప్పంద వివరాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే, గాజాలో ఇజ్రాయిల్ ఇంకా గాజాలో సైనిక కార్యకలాపాలనున కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ ఇది భద్రతా కారణాల వల్ల దాడులు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
ట్రంప్ ఇజ్రాయిల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి 20- పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. ఇందులో తక్షణ కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి, దశల వారీగా ఇజ్రాయిల్ ఉపసంహరణ, హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం, గాజాలో పరిపాలన కోసం అంతర్జాతీయ పర్యవేక్షణలో తాత్కలిక ప్రభుత్వం ఏర్పాటు కీలక అంశఆలుగా ఉన్నాయి. హమాస్ వద్ద ప్రస్తుతం 48 మంది బందీలుగా ఉన్నారు, ఇందులో సుమారు 20 మంది మాత్రమే జీవించి ఉంటారని భావిస్తున్నారు.
