ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వాదనలను మాత్రం ఆక్సియోస్ మీడియా ప్రతినిధి మాత్రం తోసిపుచ్చారు. క్షిపణులు గాల్లోకి ఎగరక ముందే ట్రంప్‌కు సమాచారం అందించినట్లు ఇజ్రాయెల్ నేతలు తనతో చెప్పారని వాదించాడు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
అయితే ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టినట్లు సమాచారం అందుతోంది. దోహా దాడులపై ఓ ప్రైవేటు సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ విమర్శించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. నెతన్యాహు తనను అవమానపరిచారని.. మోసం చేశాడంటూ సహచరులతో ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు నివేదించింది.
ఇది కూడా చదవండి: South Koria: ఎవడ్రా నువ్వు.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. కేసు ఓడిపోతే.. అలా చేస్తారా..
అయితే ఖతార్‌పై దాడి విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని.. ఆపే ప్రయత్నం చేసేలోపే దాడి జరిగిపోయిందని అమెరికా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఇక దాడి తర్వాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రంగంలోకి ఖతార్ నాయకులతో మంతనాలు జరిపారు. జరిగిన పరిణామాలు వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఖతార్ ప్రధానితో ట్రంప్ కూడా సంభాషించారు. ఖతార్ గొప్ప మిత్రుడుగా ట్రంప్ అభివర్ణించారు. ఇక ఖతార్ గడ్డపై ఇజ్రాయెల్ మరొక దాడి చేయదని హామీ ఇచ్చారు.
బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్ వైట్‌హౌస్‌కు ఆహ్వానించారని తెలిపారు. సోమవారం జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా ఈ ఆహ్వానం అందిందని చెప్పారు. సెప్టెంబర్ 9న ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత ట్రంప్‌తో అనేక సార్లు మాట్లాడినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. వచ్చే వారం ఐరాస సమావేశానికి వెళ్తున్న నెతన్యాహు.. ట్రంప్‌తో భేటీ అయి ఖతార్ దాడి విషయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవంగా ఖతార్‌పై దాడిని మొస్సాద్, ఐడీఎఫ్ కూడా అంగీకరించలేదు. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని.. అంతేకాకుండా ఖతార్‌తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నందున దాడి చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని వాదించినా నెతన్యాహు లెక్కచేయలేనట్లు సమాచారం. వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటామని మొండిగా వాదించడంతో గత్యంతరం లేక ఖతార్‌పై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే హమాస్ నాయకులంతా సేఫ్‌గా తప్పించుకున్నారు. కానీ వారి బంధువులు, ఒక ఖతార్ నాయకుడు మాత్రం బలైపోయారు.