Site icon NTV Telugu

Trump: భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు

Trump2 (2)

Trump2 (2)

భారతదేశం టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేసిందో లేదో వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం గంటల వ్యవధిలోనే దాన్ని 15 శాతానికి పెంచారు.

తాజాగా అమెరికా పార్లమెంటులో వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. భారతదేశం, ఇండోనేషియా, లావోస్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా సౌరశక్తి ఉత్పత్తులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది.

వాణిజ్య శాఖ డేటాను పరిశీలిస్తే.. 2024 సంవత్సరంలో అమెరికా భారతదేశం నుంచి సౌరశక్తి దిగుమతుల విలువ 792.6 మిలియన్ డాలర్లు ఉంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న మూడు దేశాల నుంచి గత సంవత్సరం సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీని ఆధారంగా 2025 మొదటి అర్ధభాగంలో US సౌర నమూనా దిగుమతుల్లో 57 శాతం భారతదేశం, ఇండోనేషియా, లావోస్ నుంచి మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం నుంచి వచ్చే సౌరశక్తి ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని విధించింది. ఇండోనేషియాకు 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉంటుంది. లావోస్‌కు ఇది 81 శాతం ఉంటుంది. ఈ దిగుమతి సుంకం రేట్లు విదేశీ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ దేశాల నుంచి ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను దేశీయ సౌరశక్తి ఉత్పత్తిదారుల కంటే తక్కువ ధరకు విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. భారీ సుంకాలను విధించాలనే ట్రంప్ పరిపాలన చర్య దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంది.

Exit mobile version