ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య మొదలైన యుద్ధాలన్నీ శాంతించాయి. దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాలు కూడా ముగిశాయి. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇంకా ముగియలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సఫలీకృతం కాలేకపోయింది. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది.. అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో శాంతి చర్చలు జరిపారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు! ఢిల్లీలో ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ.. తనకేం తెలియదంటున్న శివకుమార్..
తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళికతోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా సైన్య కార్యదర్శి డాన్ డ్రిస్కాల్ కలిశారు.
ఇది కూడా చదవండి: Off The Record: జూబ్లీహిల్స్ ఓటమిపై షాకింగ్ రిపోర్ట్స్.. సైడ్ చేశారని నేతల ఆవేదన!
ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికపై జెలెన్‌స్కీతో డాన్ డ్రిస్కాల్ చర్చించారు. ఈ సందర్భంగా రష్యా ఏం కోరుతుందో దానికి అంగీకారం తెల్పాలని జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు చెందిన డాన్‌బాస్‌ను రష్యాకు అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది. గంట చర్చల తర్వాత జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. 28 పాయింట్ల ప్రణాళికపై ట్రంప్‌తో చర్చించబోతున్నట్లు చెప్పారు. అమెరికా-రష్యా అధికారులు తయారు చేసిన ముసాయిదా ప్రతిపాదనను అందుకున్నట్లు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌కు అందాల్సిన రాయితీలు గురించి కూడా ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. యుద్ధం ముగింపునకు జరుగుతున్న ప్రణాళికలతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ సంకేతాలు ఇచ్చారు.
ఇక ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను చర్చించేందుకు డాన్ డ్రిస్కాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి యూఎస్ సైనిక ప్రతినిధి బృందం వచ్చే వారం రష్యాలో పర్యటించనుంది. పుతిన్‌తో 28 పాయింట్ల ప్రణాళికపై చర్చించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక జెలెన్‌స్కీతో సమావేశం తర్వాత అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దౌత్య కార్యకలాపాల్లో పురోగతి కనిపిస్తోందని.. ఈ ప్రయత్నాలు ఈరోజు.. రేపు కొనసాగిస్తామంటూ పేర్కొంది.
సాధ్యమైనంత మట్టుకు తక్కువ సమయంలోనే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా దౌత్యవేత్తలు పేర్కొ్న్నారు.
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. తాజా ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్.. డాన్‌బాస్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే సైన్యాన్ని 600, 000 మందికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉక్రెయిన్‌ను రక్షించడానికి యూరోపియన్ ఫైటర్ జెట్‌లు పోలాండ్‌లో ఉంటాయి. ఇక ఉక్రెయిన్‌లో ఎలాంటి నాటో దళాలు ఉండవు. ఇక రష్యాను జీ8 దేశాల కూటమిలోకి చేర్చుకుని శాంతికి ఒప్పుకునేలా ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలుపుతున్నారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి అధ్యక్షుడు ట్రంప్ అద్భుతమైన ప్రణాళికను ఏర్పాటు చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో అన్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో.. రష్యా-ఉక్రెయిన్‌తో నెల రోజుల నుంచి నిశ్శబ్దంగా పని చేస్తున్నారని లీవిట్ చెప్పుకొచ్చారు.
ఆ మధ్య ఇజ్రాయెల్-గాజా మధ్య ట్రంప్ 10 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఇది అద్భుతంగా విజయవంతం అయింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఇది కూడా విజయవంతం అయ్యేలా అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ శాంతి చర్చలు ఫలిస్తే.. ట్రంప్ మంచి క్రెడిట్ సంపాదించనున్నారు.