Canada: ఆర్థిక రంగంలో పరుగులు పెడుతున్న భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. అధిక పన్నులు విధించి విసిగిస్తున్న అమెరికాతో.. వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. భారత్‌తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని గురించి తెలియజేశారు. వచ్చేవారం అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సమ్మిట్ కు భారత ప్రధాని మోడీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కెనడా సర్కార్ ఈ మేరకు రియాక్ట్ అయింది. ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ7 సమావేశం కీలకమైన వేదిక అని కెనడా అంతర్జాతీయ వాణిజ్యశాఖ మంత్రి మనీందర్ సిద్ధూ కామెంట్స్ చేశారు.
Read Also: Story Board : హైదరాబాద్‌లో పబ్బులు, రిసార్టులు మాటున జరిగేదేంటి..?
అయితే, కెనడా ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికే జీ7 సమావేశం ముఖ్యమైన వేదిక.. పరస్పర ఆర్థిక సహకారం, జాతి భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది అని కెనడా మంత్రి మనీందర్ చెప్పుకొచ్చారు. కొందరి నాయకులను ఆహ్వానించడంపై స్థానిక నేతల నుంచి విమర్శలు రావడం మంచిది కాదు.. కానీ, ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ మనకు ముందున్న ఒక అవకాశం అని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో ప్రధానంగా జాతి భద్రత, విదేశీ జోక్యం అంశాలపై చర్చించబోతున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇప్పటికే స్పష్టం చేశారు.. పరస్పర ఆర్థిక సహకారం పైనా ఈ సదస్సులో చర్చించబోతున్నట్లు మనీందర్ సిద్ధూ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu Naidu: ఆ ఆటలు నా దగ్గర సాగవు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను..!
ఇక, కెనడా గడ్డపై హింసకు తావులేదని మనీందర్ సిద్ధూ తేల్చి చెప్పారు. భారత్‌తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి.. ఫేస్ టూ ఫేస్ మాట్లాడాలన్నా జీ7 సదస్సు ఓ చక్కని వేదికని వెల్లడించారు. జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆయన ఆరోపించడంతో.. భారత్, కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయని గుర్తు చేశారు. దీంతో క్రమంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బలహీనపడ్డాయి.