ATM Display: సాధారణంగా ఏటీఎంకు వెళ్తే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. అయితే వేరేవాళ్లు తమ ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బులు దోచుకుంటారేమోనని భయంతో ట్రాన్సాక్షన్ ముగిసిన వెంటనే కొంతమంది నంబరు బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకు వస్తారు. బ్యాంకులో ఉన్న నిల్వ మొత్తం, ఇతర వివరాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతారు. అయితే అమెరికాలోని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం ఖాతాదారుల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి ఏటీఎం మిషన్‌లో కార్డుపెట్టి ఎదురుగా నిలుచుంటే చాలు.. కస్టమర్ ఫోటో తీసి ఖాతాలో ఎంత మొత్తం ఉందో ఏటీఎంపై ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తోంది.
Read Also: Avoid Salt: ఉప్పు ముప్పే.. తినేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకుంటే..
అకౌంట్‌లో ఎంత మొత్తంలో డబ్బు ఉందో చూపిస్తూనే పక్కనే ఖాతాదారుడు ఫోటోను కూడా ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా ఖాతాలో ఎక్కువ మొత్తం నిల్వ ఉన్న ఖాతాదారుడి పేరు మొదటి స్థానంలో ఉండి.. అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల పేర్లను కూడా చూపిస్తోంది. ఈ ఏటీఎంను న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్ఎఫ్(MSCHF) సంస్థతో కలిసి పెర్రోటిన్ గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎంను మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎం తరహాలోనే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏటీఎం వైవిధ్యంగా ఉండటంతో చాలా మంది ప్రజలు దీనిని వినియోగించుకునేందుకు ఎగబడుతున్నారు.