కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద అట్టిపెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పదే పదే చెబుతూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తాజాగా మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరికట్టకపోతే ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడం అసాధ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్‌పై సమావేశమైన డబ్ల్యుహెచ్‌ఓ నిపుణుల కమిటీ సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసుల కోసం పెద్దఎత్తున వ్యాక్సిన్లను అంటిపెట్టేసుకున్నాయని, ఈ అదనపు నిల్వలను అల్పాదాయ దేశాలకు సరఫరా చేస్తే అక్కడి ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచవచ్చని అన్నారు.
కోవిడ్ బారిన పడుతున్నవారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా చేస్తూ, ఈ మహమ్మారి ఆట కట్టిస్తామని ప్రగల్భాలు పలకడం వల్ల ఉపయోగమేమిటి అని డబ్యుహెచ్‌ఓ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్, బయోలాజికల్స్ విభాగం అధిపతి డాక్టర్ కేట్ ఓ బ్రియాన్ ప్రశ్నించారు. వ్యాక్సిన్లు ఒక వైపు నిల్వ పెట్టుకుని వృథాగా పారబోసే పరిస్థితి ఉంటే, మరో వైపు వ్యాక్సిన్లు లేక పేద దేశాలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు.