తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్‌కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలూ కొన్ని నెలల నుంచి అందడం లేదు. ఉద్యోగులు వేతనాల కోసం రోడ్డెక్కి ధర్నాలూ చేస్తున్నారు. తాలిబాన్లు రాక పూర్వం ఒక అమెరికన్ డాలర్ విలువ 80 అఫ్ఘానీలు ఉండగా.. ఆ విలువ 100 నుంచి 130 అఫ్ఘానీలకు పతనమైంది. ఆప్ఘనిస్తాన్‌కు విదేశి ఆర్థిక సాయం అందకపోవడమే ఈ పరిస్థితులకు కారణమని అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఐఎంఎఫ్ సహా పాశ్చాత్య, ఇతర దేశాలు విదేశీ సాయాన్ని నిలిపేశాయి. అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్లు చేసిన ప్రయత్నా సఫలం కాలేదు. దీంతో విదేశీ సహాయం లేకుండానే తాలిబాన్లు మొదటి సారి స్వంత బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు.