సాధారణంగా ఉద్యోగం చేసే ఉద్యోగులు ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఎక్కడలేనన్ని సాకులు చెప్తారు.. బామ్మ గారు చనిపోయారని, హెల్త్ బాలేదని, భార్యకు ఆరోగ్యం బాలేదని, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లాలని ఇలా చాలా రకాల సాకులను మనం వినే ఉంటాం. కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ సెలవుపై కారణం కూడా చెప్పాడు. అది ఏంటంటే.. “డియర్ బాస్.. ఈరోజు నేను ఆఫీస్ కి రాలేకపోతున్నాను.. ఎందుకంటే నా సాక్సులు చాలా మురికిగా ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ నా సాక్సులను ఉతకలేదు. సాక్సులు లేకుండా షూస్ వేసుకోలేను .. షూస్ లేకుండా ఆఫీస్ కి రాలేను.. అందులో మళ్లీ నా షూస్ కి రంద్రాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఆఫీస్ కి రావడం లేదు” అని మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చదివిన బాస్ కి దిమ్మతిరిగిపోయింది.
ఏం చెప్పాలో తెలియక మరో మెసేజ్ పెట్టాడు. ” మీరు అంతగా నవ్వుతున్నారు.. ఏంటి కామెడీ చేస్తున్నారా..? షూస్ లేకపోవడమేంటి.. సరే రేపు ఆఫీస్ కి రా.. మాట్లాడుకుందాం.. ఇదే ప్లేస్ వేరొక ఉద్యోగి ఉంటె రేపటి నుంచి ఆఫీస్ కి రమ్మనేవాడిని కాదు” అంటూ తెలిపాడు. ఇక ఈ మెసేజ్ స్క్రీన్ షూట్ ని బాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉద్యోగుల సాకులు అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సాక్సులు నేను కొనిస్తా రా అని చెప్పాల్సింది అని కొందరు.. ఇంతకీ రేపు వచ్చాకా అతడిని ఏం చేస్తారో చెప్పండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.