Site icon NTV Telugu

US-Iran: ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్.. చుట్టుముడుతోన్న అమెరికా సైన్యం

Us Iran

Us Iran

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. భారీ స్థాయిలో అమెరికా సైన్యం మోహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. తాజాగా మరో అతిపెద్ద విమాన వాహన నౌక తరలివెళ్తున్నట్లుగా తెలుస్తోంది. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌ను కరేబియన్ నుంచి మధ్య ప్రాచ్యానికి తరలించాలని ఆదేశాలు వెళ్లడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ నౌకతో పాటు మూడు గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లు మోహరించాయి.

ప్రస్తుతం అణు ఒప్పందంపై ఇరాన్‌తో అమెరికా చర్చలు నడుపుతోంది. త్వరలోనే ఒప్పందం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ చర్చలు గనుక విఫలమైతే ఏ క్షణంలోనైనా అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. గత వారం ఒమన్‌లో పరోక్ష చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. అణు ఒప్పందం చేసుకునేందుకు ఏ మాత్రం ఇరాన్ మొగ్గు చూపడం లేదు. అమెరికాను ధీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుందని సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు రహస్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌, యూఎస్‌ఎస్‌ ఫ్రాంక్‌ ఈ పీటర్సన్‌ జూనియర్‌, యూఎస్‌ఎస్‌ స్ప్రూయాన్స్‌ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్‌ మిషెల్‌ మార్ఫీలు తరలించినట్లు తెలుస్తోంది. తాజాగా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను సైతం వెళ్తుండంతో భయాందోళనలు మొదలయ్యాయి.

Exit mobile version