ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. వివరాల్లోకి వెళ్తే… బెల్జియంకు చెందిన రూథర్‌ఫర్డ్ అనే 19 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఒంటరిగా చిన్న విమానంలో ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది.
Read Also: మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర
రూథర్ ఫర్డ్‌కు చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించడం కల. అందులోనూ ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. బుల్లివిమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. వాస్తవానికి ఆమె ప్రపంచ యాత్ర మూడునెలల్లోనే పూర్తికావాలి. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల ఐదునెలలు పట్టింది. 155 రోజుల తర్వాత గురువారం స్వదేశంలోకి అడుగు పెట్టిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చి స్వాగతం పలకడం విశేషం.