Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Read Also: Taliban minister: ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు కీలక హామీ.. పాకిస్తాన్‌కు తాలిబాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ రోజు తెల్లవారుజామున ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన ముగ్గురు గిరిజన నాయకులను నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అపహరించి చంపారని పాక్ పోలీసులు తెలిపారు. టీటీపీతో నవంబర్ 2022లో పాక్ ప్రభుత్వం కాల్పుల విరమణను విరమించుకున్న తర్వాత పాకిస్తాన్ లో తీవ్రవాద దాడులు పెరిగాయి.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో తాలిబాన్లు విరుచుకుపడుతుంటే, బలూచిస్తాన్ ప్రాంతంలో ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లో మొత్తం దాడుల్లో 90 శాతానికి పైగా దాడులు ఈ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.