ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మూడోంతుల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు తాజాగా మరో నాలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజధాని కాబుల్ కు 80 కిలోమీటర్ల దూరంలో సైనికులకు, తాలిబన్లకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎప్పుడైతే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి తాలిబన్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. దేశంలో రెండు పెద్ద నగరాలైన హెరాత్, కాందహార్‌లను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాబూల్ ను కూడా త్వరలోనే సొంతం చేసుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. రాజధాని కాబూల్‌లోని వివిధ దేశాల రాయబారి కార్యాలయాల్లోని సిబ్బందిని, ఆయా దేశాలన పౌరులను సైనికుల సహాయంతో వెనక్కి రప్పిస్తున్నారు. అమెరికా 3000 మంది సైనికుల సహాయంతో తమ అధికారులను, తమ పౌరులను వెనక్కి రప్పిస్తుంటే, బ్రిటన్ కూడా సైనికులను పంపి సిబ్బందిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇండియా ఇప్పటికే అనేక మంది భారతీయులను ఎయిర్‌లిఫ్ట్ చేసింది.