Sunflower oil rates may rise due to russia-ukraine war: మళ్లీ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు మరోసారి ధరలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ నగరాలపై భారీగా దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మికోలైన్ మీద క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ట్యాంకులే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. దీంతో ట్యాంకుల్లో ఉండే ఆయిల్ మంటలకు ఆహుతి అయింది. ట్యాంకులపై కామికాజ్ డ్రోన్లతో దాడులు చేయడంతో ఉక్రెయిన్ కు తీవ్ర నష్టం వాటిల్లింది.
Read Also: Madhya Pradesh: రూ. 2.9 లక్షలు కట్టాలని 12 ఏళ్ల బాలుడికి ప్రభుత్వం నోటీసులు..
అక్టోబర్ 17న జరిగిన ఈ దాడి వల్ల నిల్వ ఉంచిన సన్ ఫ్లవర్ ఆయిల్ దాదాపుగా నాశనం అయింది. దీంతో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న నూనె మొత్తం కాలిపోయింది. దీంతో భారత్ పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం ఉక్రెయిన్, రష్యాల నుంచే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. మనదేశంతో పాటు యూరప్ దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. ప్రపంచానికి 75 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యాల నుంచే ఎగుమతి అవుతోంది.
ఈ పరిణామం వల్ల దేశంలో లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ పై రూ. 50 పెరిగే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ కొత్త ట్యాంకులను నిర్మించే వరకు ఉక్రెయిన్ ఇతర దేశాలకు సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఉక్రెయిన్ నుంచి మనదేశానికి దాదాపుగా సన్ ఫ్లవర్ ఆయిల్ రాదని తెలుస్తోంది. తాజాగా రష్యా దాడుల వల్ల 25 శాతం మేర సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.
గతంలో ఉక్రెయిన్ రేవులపై దాడులు చేయమని రష్యా హామి ఇచ్చింది. ఇదిలా ఉంటే క్రిమియాను రష్యాతో కలుపుతున్న కెర్చ్ బ్రిడ్జిని కూల్చేసింది ఉక్రెయిన్. దీంతో రష్యా ఆగ్రహానికి బలవుతోంది ఉక్రెయిన్. రాజధాని కీవ్ తో సహా ఖార్కీవ్ ఇలా డజనుకు పైగా పట్టణాలు, నగరాలపై ఇరాన్ డ్రోన్లతో, క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా భారీగా దాడులు చేస్తోంది. దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ నష్టపోయిందని.. ప్రజలు సిద్ధంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు.