తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడే పరారయ్యాడు. ప్రజలు నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులు..అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లాడు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తగ్గించారు. ప్రభుత్వ భవనాలను కూడా ఆందోళనకారులు ఖాళీ చేశారు. ఈ రోజు శ్రీలంక పార్లమెంట్ సమావేశం కాబోతోంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే సంక్షోభ స్థితిలో ఉన్న దేశాన్ని రక్షించేందుకు శ్రీలంక యువత నడుంబిగించింది. పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేస్తోంది. శ్రీలంక హాష్ ట్యాగ్ తో ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస శ్రీలంకవాసులు యువత చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని బట్టి విరాళాలు ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తమ భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం ఆందోళనలు చేసిన యువత ప్రస్తుతం దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక పునర్వైభం కోసం కృషి చేస్తున్నారు.
Read Also: Godavari River Floods: 32 ఏళ్ల తర్వాత 70 అడుగులు.. నీటమునిగిన 95 గ్రామాలు
కేవలం పర్యాటకం, వ్యవసాయంపై ఆధారపడిన శ్రీలంక.. రాజపక్స కుటుంబీకులు అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో దివాళా తీసింది. కోవిడ్ వల్ల కూడా గత రెండేళ్లుగా పర్యాటకం క్షీణించింది. దీంతో విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు చైనా నుంచి తీసుకున్న అప్పులతో పాటు ఇతర అంతర్జాతీయ బ్యాంకులకు శ్రీలంక భారీగా రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి నెల నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది.