శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది.
ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 450 కాగా.. డిజిల్ ధర రూ. 445కు పెంచారు. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డిజిల్ ప్రజలకు లభించడం లేదు. పెట్రోల్ రాకుండానే ధరలు పెంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడెక్కి నిరసన తెలుపుతున్నారు లంక వాసులు.
ఇదిలా ఉంటే శ్రీలంకకు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇప్పటికే ఒకసారి 40,000 మెట్రిక్ టన్నుల డిజిల్ ను ఇండియా, శ్రీలంకకు సరఫరా చేసింది. మరోసారి 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను శ్రీలంకకు పంపించింది. ఈ విషయాన్ని సోమవారం ఇండియా వెల్లడించింది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఇండియా పొడగించింది. సోమవారం ఇండియా పంపిన పెట్రోల్ శ్రీలంకు చేరుకున్నట్లు భారత హైకమిషనర్ ట్విట్టర్ లో వెల్లడించారు.
విదేశీ నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వడంతో పెట్రోల్ కొనుక్కునేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఇదిలా ఉంటే పెట్రోల్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఉత్తర మధ్య ప్రావిన్స్ లోని బంకు యజమాని ఇళ్లును తగలబెట్టారు. దీంతో ఇలా చేస్తే పెట్రోల్ రవాణాను నిలపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.