శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్ దొరక్క.. దొరికినా ధరలు పెరగడంతో ప్రజల్లో ఆసహనం పెరుగుతోంది. ఇప్పటికే దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రజల ఆందోళన నేపథ్యంగాలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాడు గోటబయ రాజపక్స. కొత్త మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేశాడు.
అయితే ఇటీవల హింసాత్మక ఘటనలు, ఆందోళనలు పెరగడంతో మే 6 అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ ప్రకటించారు. తాాజాగా రెండు వారాల ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ మే 21న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో కూడా శ్రీలంకలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 9 మంది చనిపోవడంతో పాటు 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆర్మీ, పోలీసులకు ఆందోళనలను అణచివేయాలని విశేషాధికారాలు కల్పించింది గోటబయ సర్కార్ తాజాగా ఎమర్జెన్సీని శనివారం ఎత్తేయడంతో ద్వీప దేశంలో ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ఇదిలా ఉంటే దేశంలో ద్రవ్యోల్భనం 40 శాతం దిశగా దూసుకుపోతోంది. ఆహారం, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాటు తీవ్ర కొరత ప్రజలను వేధిస్తోంది. కనీసం పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో డాలర్ల కొరత ఉంది. శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత ఇలాంటి ఆర్థిక సంక్షోభం రావడం ఇదే తొలిసారి. తాజాగా శ్రీలంకలో పెట్రోల్ కోసం ప్రజలు బంకుల ముందు కొట్టుకుంటున్నారు. మూడు రోజులుగా పెట్రోల్, డిజిల్ కొరత దేశాన్ని వేధిస్తోంది. బ్లాక్ లో లీటర్ పెట్రోల్ రూ. 1200-1500 వరకు పలుకుతోంది. మరోవైపు కరెంట్ కోతలతో శ్రీలంక జనాలు అల్లాడిపోతున్నారు.