శ్రీలంకను సంక్షోభం కుదిపేస్తోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన కీలక ప్రకటన చేశారు. దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
మనుగడకు పోరాటం చేస్తున్న ప్రజల్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. రాజకీయ నాయకులు ప్రజల పక్షం వహించాలని ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, అతని పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ, ‘దేశంలోని అత్యంత ధనవంతుల నుండి అమాయక రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, వెంటనే వైదొలగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా.. ఈ ప్రభుత్వం వెళ్లనందున నేను కూడా వీధుల్లోకి వచ్చానన్నారు. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా అన్నారు.
దేశంలో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాను ఇంట్లో ఉండలేనని అన్నారు.వ్యవసాయరంగం సంక్షోభంలో వుందన్న ఆయన, ధరలు తగ్గాలంటే వ్యవసాయం చేయాలన్నారు. రైతాంగం సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సి అవసరముందన్నారు. దేశం అంతటా ప్రజలు ఆహారం, ఇంధనం కోసం అలమటిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందన్నారు.