Secunderabad: సికింద్రాబాద్ చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. సికింద్రాబాద్‌కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు మద్దతుగా ‘సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
READ MORE: MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో పుస్తకాల్లో తుగ్లక్ గురించి చదివామని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా తుగ్లక్ ఎలా ఉంటాడో చూస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన తొలి పని తెలంగాణను టీఎస్ నుంచి టీజీగా మార్చడమేనని, దీని వల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తనకు తెలియదని అన్నారు. తెలంగాణ తల్లిని తొలగించి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారని ఆరోపించారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండాలని, దాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని, సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
READ MORE: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్