తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని నిర్ణయంపై ఆసక్తిగా మారింది శ్రీలంక రాజకీయం. రాజీనామా చేసిన వారిలో ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు క్రీడా శాఖమంత్రి నమల్ రాజపక్సే కూడా వున్నారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు కూడా వుంటారు. రాజకీయ సుస్థిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక ప్రభుత్వం అవసరమని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. రాష్ట్రపతి గోటబోయ రాజపక్షేకి లేఖ రాశారు సిరిసేన. ప్రభుత్వంలోని 11 మిత్రపక్ష పార్టీల నుంచి కూడా అవే ప్రతిపాదనలు వచ్చాయి.
ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే వారు మంత్రులు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్డు నుంచి పాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం కొనలేక, తినలేక అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలు, నిత్యావసరాల కొరత, విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్న ప్రజలు ఇటీవల అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. దీంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
https://ntvtelugu.com/srilanka-crisis-ban-on-social-media/
తాజాగా శ్రీలంకలో కర్ఫ్యూ ముగిసింది. యధావిధిగా రోడ్లుపైకి లంక వాసులు చేరుకుంటున్నారు. మరోవైపు అధ్యక్షుడు, రాష్ట్రపతి భవనం, ఇంటి వద్ద భారీ భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని భద్రతా బలగాలు చెబుతున్నాయి.