Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్‌ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు.
ఏది ఏమైనప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్‌కి స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, బిలావల్ భుట్టోకి చెందిన పీపీపీ, నవాజ్ షరీఫ్ యొక్క పీఎంఎల్-ఎన్ పార్టీలు సంక్షీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం 18 రోజుల తర్వాత ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ గురువారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 265 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 133 మ్యాజిక్ ఫిగర్. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది.
Read Also: Devi Prasad: లేట్ అయినా భలే పాత్ర దొరికింది.. తెరపై దర్శకుడి వీరంగం!
ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా 93 మంది గెలుపొందారు. నవాజ్ షరీఫ్ పార్టీకి 75 స్థానాలు రాగా.. భుట్టో పార్టీకి 54 సీట్లు దక్కాయి. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) 17 సీట్లు గెలుచుకుంది. షరీఫ్, భుట్టో పార్టీ, ఇతర ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకారానికి వచ్చాయి. షహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని అయితే పాకిస్తాన్‌కి రెండోసారి ప్రధాని అయినట్లవుతుంది. ఈ ఎన్నికల ముందు కూడా ఆ దేశానికి ఈయనే ప్రధానిగా ఉన్నారు. ఈ రెండు పార్టీల ఒప్పందం ప్రకారం.. పీపీపీ నుంచి బిలావల్ భుట్టో తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉండనున్నారు. గతంలో 2008 నుంచి 2013 వరకు ఈయన ప్రెసిడెంట్‌గా పనిచేశారు.