Scotland Woman Gets Baby Son’s Body From Hospital After 48 Years: చనిపోయిన తన బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి ఏకంగా నాలుగున్నర దశాబ్ధాలుగా పోరాడుతోంది. తన బిడ్డకు ఏమైందని తెలుసుకోవాలని పోరాడుతోంది. చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత 48 ఏళ్లకు తన కొడుకు అవశేషాలను శుక్రవారం పొందింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన యూకేలో జరిగింది. స్కాట్లాండ్ ఎడిన్ బర్గ్ కు చెందిన లిడియా రీడ్ అనే మహిళ 1975లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం లిడియా రీడ్ కు 74 ఏళ్లు. అయితే పుట్టిన వారం వయసులోనే ఆమె పసిబిడ్డ గ్యారీ, రీసన్ వ్యాధితో మరణించాడు. శరీరంలోని ప్రతిరక్షకాలు శిశువు రక్తకణాలను నాశనం చేసే అత్యంత అరుదైన వ్యాధి. దీని కారణంగా పసిపిల్లాడు మరణించాడు.
పిల్లాడు మరణించిన కొద్ది రోజుల తర్వాత తన కొడుకును చూడాలని ఆస్పత్రిని కోరినప్పుడు ఆమెకు వేరే బిడ్డను చూపించినట్లు రీడ్ పేర్కొంది. అయితే తన ఇష్టానికి విరుద్ధంగా తన కొడుకుకు పోస్టుమార్టం నిర్వహించారని రీడ్ ఆరోపించింది. తన కొడుకు అవశేషాల కోసం పోరాడింది. చివరకు 2017 సెప్టెంబర్ నెలలో రీడ్ కొడుకును ఖననం చేసిన చోటును తవ్వి తీయాలని కోర్టు ఆదేశించింది. అయితే పిల్లాడిని ఖననం చేసిన చోట ఎలాంటి అవశేషాలు దొరకలేదు.
Read Also: TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి
తన కొడుకు అవయవాలను పరిశోధన కోసం తొలగించారని రీడ్ గ్రహించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎడిన్ బర్గ్ రాయల్ ఇన్ ఫర్మరీ లో భద్రపరిచిన అవయవాలను, శరీర భాగాలను తల్లికి అప్పగించడానికి క్రౌన్ ఆఫీస్ అనుమతి ఇచ్చింది. పరిశోధన కోసం పిల్లల శరీరభాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాయో బహిర్గతం చేసిన వ్యక్తిగా రీడ్ గుర్తింపు పొందింది. లివర్ పూర్ లోని ఆల్డర్ హే ఆస్పత్రిని దోషిగా నిలబెట్టింది. బీబీసీ నివేదిక ప్రకారం 1970 నుంచి 2000 మధ్యకాలంలో స్కాటిష్ ఆస్పత్రుల్లో దాదాపుగా 6,000 అవయవాలు, కణజాలలను ఉంచినట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పేగు క్యాన్సర్ తో బాధపడున్న రీడ్, ఎడిన్ బర్గ్ లోని జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తన బిడ్డ మిగతా శరీర భాగాలు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదని చెప్పింది. నా కొడుకు అవశేషాలు పొందడానికి చాలా కాలం కష్టపడ్డానని.. దీన్ని మాటల్లో చెప్పడం కష్టంగా ఉందని భావోద్వేగానికి గురైంది. తాను చనిపోయే ముందు తన కొడుకుకు అంత్యక్రియలు నిర్వహిస్తానని, ఇది నాకు ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొంది.