Russia-Ukraine War: పది నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి చర్చించారు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్ కు యుద్ధం ఆపాలనే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. ఇక రష్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నా.. పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ ను ముందుపెట్టి అమెరికా, వెస్ట్రన్ దేశాలు తమపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది.
Read Also: USA: మంచు తుఫాన్‌తో అల్లాడుతున్న అమెరికా.. 31 మంది మృతి
ఇదిలా ఉంటే రష్యా అణ్వాయుధాలే తమను రక్షిస్తున్నాయని పుతిన్ మిత్రుడు మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ అన్నారు. తమపై వెస్ట్రన్ దేశాలు యుద్ధ ప్రకటించకుండా అణ్వాయుధాలే అడ్డుకుంటున్నట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ లో ఫాసిస్ట్, అసహ్యకరమైన పాలన తొలగించే వరకు రష్యా యుద్ధాన్ని చేస్తుందని ప్రకటించారు. మెద్వదేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు పుతిన్ ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని వెల్లడించారు. పాశ్యాత్య దేశాలు రష్యాను వీలైనంత వరకు అవమానించడం, కించపరచడం, విచ్ఛిన్నం చేయాలని, నాశనం చేయాలని కోరికతో ఉన్నాయని.. మెద్వదేవ్ అన్నారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాలో పర్యటించారు. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించారు. ముఖ్యంగా ఆయుధాలు, ఆర్థిక సాయంతో పాటు అమెరికా పేట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. వీటిని ఇచ్చేందుకు అమెరికా కూడా సమ్మతించింది. దీంతో రానున్న రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.