ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు మళ్లీ మారణహోమానికి పాల్పడుతున్నాయి. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు యుద్ధం తొలినాళ్లలో యత్నించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన రష్యా ఇప్పుడు మళ్లీ రాజధాని సహా పలు నగరాలపై క్షిపణుల్ని గురిపెట్టి సామాన్యుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. తాజాగా సోమవారం ఉక్రెయిన్‌లోని క్రెమెంచుక్ నగరంలో రద్దీగా ఉండే మాల్‌పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఈ క్షిపణి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. సుమారు 59 మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గాయపడిన వారిలో 25మంది ఆస్పత్రి పాలయ్యారన్నారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ అధిపతి సెర్గీ క్రుక్ వెల్లడించారు. క్షిపణి దాడులతో అగ్నికీలలు 10,300 చదరపు మీటర్ల వరకు విస్తరించాయని వివరించారు.
మరోవైపు మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఒచాకివ్ నగరంపై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీ మార్కెట్, కమ్యూనిటీ సెంటర్, నివాస భవనాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు మైకోలైవ్ గవర్నర్ ఒలెక్సాండర్ సింకేవిచ్ తెలిపారు. అలాగే, ఓ చిన్నారితో పాటు ఆరుగురు గాయపడ్డారని వివరించారు. ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు 4,731మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా.. మరో 5,900మంది గాయపడినట్టు ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ వెల్లడించారు. ఈ దాడుల్లో 330మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 489మంది గాయపడినట్టు పేర్కొన్నారు. కాగా, రష్యా భీకర క్షిపణి దాడులతో ఉక్రెయిన్ రాజధాని తల్లడిల్లుతోంది.
ఈ నేపథ్యంలో, తమకు క్షిపణి రక్షణ వ్యవస్థలు కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బెర్గ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రష్యా క్షిపణిదాడులను తిప్పికొట్టాలంటే శక్తిమంతమైన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు అవసరమని జెలెన్ స్కీ పేర్కొన్నారు. అటు, జీ7 దేశాల సదస్సులోనూ ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చింది. ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలు రష్యా చేపట్టిన సైనికచర్యను ‘అక్రమ యుద్ధం’గా అభివర్ణిస్తూ తీర్మానం చేశాయి. అంతేకాదు, మాడ్రిడ్ లో జరిగే నాటో సమావేశంలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర పర్యవసానాలపై నేతలు చర్చించనున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగిశాక యూరప్ భద్రతకు రష్యా పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందని బ్రిటన్ ఆర్మీ చీఫ్ పాట్రిక్ శాండర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.