Russian youth fleeing to neighboring countries: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మరింత సైనికులను సమీకరించాలని పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రష్యాలో గతంలో మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్న వారు, శిక్షణ పొందిన వారు యుద్ధంలోకి బలవంతంగా చేరేలా పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ నిర్ణయంతో రష్యా యువతలో భయాందోళనలు ఏర్పడ్దాయి. దీంతో పెద్ద ఎత్తున రష్యా యువకులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు.
ఇప్పటికే వేలాదిగా వాహనాలు జార్జియా దేశపు సరిహద్దుల్లో నిలిచాయి. రష్యా నుంచి పెద్ద ఎత్తున యువత జార్జియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు కజకిస్తాన్, ఫిన్లాండ్, మంగోలియా దేశాల్లోకి వెళ్లేందుకు రష్యా యువత ప్రయత్నిస్తోంది. దీంతో ఈ దేశాలకు రష్యాతో ఉన్న సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టాయి. జార్జియా వద్ద సరిహద్దు దాటేందుకు 48 గంటల సమయం పడుతోంది.
Read Also: Puducherry: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం.. బీజేపీ, ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమిలో చిచ్చు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి చాలా మంది రష్యా ప్రజలు జార్జియా రాజధాని టిబిలిసికి చేరుకున్నారు. పది లక్షల జనాభా ఉండే టిబిలిసిలోకి 40,000 మంది రష్యన్లు వచ్చి చేరారు. తాజాగా జార్జియా సరిహద్దు వద్ద 3000 వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి పాక్షిక సైనిక సమీకరణ ఆదేశాలు రాగానే చాలా మంది అన్నీ వదిలిపెట్టి వేరే దేశాలకు పయణం అయ్యారు. రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాల టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. జార్జియా రాజధాని టిబిలిసిలో అపార్ట్మెంట్ల రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. రష్యన్ల రాకతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే రష్యా సరిహద్దులు కూడా మూసివేస్తారనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఉన్న సమయంలోనే దేశాన్ని దాటాలని యువత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జార్జియాతో పాటు కజకిస్తాన్ దేశాలకు రష్యన్లను రానీవ్వద్దని క్రెమ్లిన్ నుంచి ఆదేశాలు వెళ్లాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. రష్యాకు భయపడి రష్యన్లను తమ దేశానికి రానీయడానికి ఈ దేశాలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.