Russia Refuses To Provide Pakistan 30-40% Discount On Crude Oil: దాయాది దేశం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది రష్యా. భారతదేశం, పాకిస్తాన్ ఒకటి కాదని చెప్పకనే చెప్పింది. ఆర్థిక కష్టాల్లో పాకిస్తాన్ చమురు కోసం అల్లాడుతోంది. అయితే భారత్ కు ఇచ్చిన విధంగానే మాకు కూడా డిస్కౌంట్ కు చమురు ఇవ్వాలని రష్యాను కోరింది. అయితే పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను నిరాకరించింది. రష్యా ముడి చమురుపై 30-40 శాతం తగ్గింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మాస్కోలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం అధికారులు, రష్యా అధికారులతో చర్చల్లో భాగంగా చమురు ధరలు తగ్గించాలని కోరింది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్, జాయింట్ సెక్రటరీలు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
Read Also: Pak vs Eng: పాకిస్థాన్‌తో టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ జట్టు.. 112 ఏళ్ల రికార్డు బ్రేక్..
పాకిస్తాన్ డిమాండ్ ను రష్యా అధికారులు సున్నితంగా తిరస్కరించారు. ముడిచమురుపై ధర తగ్గించడంతో పాటు రవాణా ఖర్చులు, దిగుమతి చేసుకునే అవకాశాలను గురించి చర్చించేందుకు పాకిస్తాన్ ప్రతినిధి బృందం నవంబర్ 29న మాస్కోకు మూడు రోజుల పర్యటనకు వెళ్లింది. కరాచీ నుంచి పంజాబ్ లోని లాహోర్ వరకు పాకిస్తాన్ ఏర్పాటు చేయబోతున్న పాకిస్తాన్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు తమకు సహకరించాలని పాక్, రష్యాను కోరింది. అంతకుముందు నవంబర్ 13న పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలుును అమెరికా ఆపలేదని.. త్వరలోనే సాధ్యం అవుతుందని కామెంట్స్ చేశారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇషాక్ దార్ ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖతో సమావేశం అయ్యారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు, ఇతర వెస్ట్రన్ దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాయి. అయితే ఈ క్రమంలో మిత్రదేశం అయిన భారత్ కు డిస్కౌంట్ పై ముడి చమురును ఆఫర్ చేసింది. అప్పటి నుంచి భారత్, రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇది అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలకు నచ్చడం లేదు.