రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఆయుధాలు వీడాలంటూ ఎన్ని అల్టీమేటంలు జారీ చేసినా తమ దారికి వచ్చేందుకు ఉక్రెయిన్ సైన్యం ససేమిరా అంటుండటంతో ఆగ్రహించిన రష్యా.. మంగళవారం నాడు ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. రష్యాకు ఆనుకుని ఉన్న ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. 24 గంటల వ్యవధిలో దాదాపుగా వెయ్యి ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది.
తమ మధ్య యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఒక్క మరియుపోల్‌లోనే కాకుండా ఉక్రెయిన్‌లో ఉన్న సైన్యమంతా తమకు లొంగిపోవాలని రష్యా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అల్టీమేటం జారీ చేసింది. అర్థం పర్థం లేని ప్రతిఘటనను విడిచిపెట్టాలని సైన్యాన్ని ఆదేశించాలని ఉక్రెయిన్‌కు సూచించింది. ఒకవేళ అలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే సైనికులే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలని.. అయితే వారి ప్రాణాలకు ఎలాంటి హామీ ఉండదని రష్యా ప్రకటించింది.
అటు తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన 13 ఆయుధ గారాలను, 60 వరకు సైనిక సదుపాయాలను నాశనం చేశామని.. క్షిపణి వార్‌హెడ్లను భద్రపరిచే డిపోలు కూడా తాము దాడి చేసిన వాటిలో ఉన్నాయని రష్యా రక్షణశాఖ ప్రకటన చేసింది. కాగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో మొదలైన రష్యా సైనిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యా రాజధాని మాస్కోలో దాదాపు 2 లక్షల మంది జీవనోపాధి కోల్పోయారు.
https://www.youtube.com/watch?v=oGnsdQHJxrk