తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకను నిరసనలు చుట్టుముడుతున్నాయి. శ్రీలంక ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు. తీవ్ర ఘర్షణలకు దారితీశాయి పెట్రోలు, డీజల్ ధరల పెంపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు తొలగించారు ఆందోళనకారులు.
రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు వర్షం కురిపించారు పోలీసులు. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయాల పాలయ్యారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా వుంది.
శ్రీలంక పౌరులకు ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మునుపెన్నడూ లేని విధంగా పెంచేసింది. ప్రభుత్వ ఆధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటర్ పెట్రోల్ ధరను దాదాపు శ్రీలంక కరెన్సీలో 84 రూపాయల మేర పెంచింది. దీంతో 92 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర ఎల్కేఆర్ 338కి, 95 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర రూ. 95 మేర పెరిగి రూ. 373కు చేరింది.
సూపర్ డీజిల్ లీటర్ ధర రూ.75 పెరిగి రూ.329కి చేరుకుంది. ఆటో డీజిల్ లీటర్ ధర రూ.113 పెరిగి రూ. 289కి చేరింది. దీంతో వాహనదారులు నిరసనకు దిగారు. ఆకాశాన్నంటిన పెట్రో ధరలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన లంక ప్రజలకు మరింత భారంగా మారింది. శ్రీలంకలో గత ఆరునెలల కాలంలో LIOC ఇంధన ధరలను ఐదుసార్లు పెంచింది. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్ రేట్లను పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న జనం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారు.