రెడ్ లిప్‌స్టిక్ వేసుకుంటున్నారా? అయితే ఒకసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అందానికి సంబంధించిన నియమాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా మహిళలు అందంగా కనిపించేందుకు మేకప్‌ను ఉపయోగిస్తారు. ఎంత మేకప్ చేసినా లిప్‌స్టిక్ లేకపోతే అలంకరణ పూర్తి అయినట్టుగా అనిపించదు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం మేకప్‌పై, ముఖ్యంగా రెడ్ లిప్‌స్టిక్‌పై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.
అలాంటి దేశాల్లో ఒకటి ఉత్తర కొరియా. ఈ దేశాన్ని నియంతగా పేరుగాంచిన కిమ్ జోంగ్ ఉన్ పాలిస్తున్నారు. ఉత్తర కొరియాలో మహిళలు ఎరుపు రంగు లిప్‌స్టిక్ వాడటం అనధికారికంగా పూర్తిగా నిషేధించబడింది. అక్కడి మహిళలు కేవలం దేశంలోనే తయారైన లేత రంగు లిప్‌స్టిక్‌లు, పరిమిత మేకప్ మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉంది.
ఉత్తర కొరియాలో ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానం, వ్యక్తిగత ఆకర్షణకు చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన మేకప్ యువతలో వ్యక్తివాదాన్ని పెంచుతుందని, అది దేశానికి ప్రమాదకరమని కిమ్ జోంగ్ ఉన్ నమ్మకం. అందుకే ఈ దేశంలో విదేశీ బ్రాండ్లు, ముదురు రంగుల లిప్‌స్టిక్‌లు, ఆడంబరమైన మేకప్‌పై కఠినమైన నియమాలు అమలు చేస్తున్నారు.
ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే ఉత్తర కొరియాలో మహిళలు చాలా సరళమైన మేకప్‌తోనే బయటకు రావాల్సి ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించే ఈ నియమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.