Sri lanka New President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లను సాధించి ఆయన విజయం సాధించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు. మొత్తం 225 ఓట్లు కాగా.. 4ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఇద్దరు ఓటేయడానికి రాలేదు. దీంతో 219 ఓట్లకు గానూ 134 ఓట్లు సాధించి 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో డల్లాస్ అలహప్పెరుమాకు 82 ఓట్లు రాగా.. అనురా దిస్సనాయకేకు 3 ఓట్లు వచ్చాయి.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరసనలు వెల్లవెత్తడంతో అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే.. తాత్కాలిక అద్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం అధ్యక్ష పదవికి ప్రకటన వెలువడింది. అయితే 1978 నుండి అంటే గత 44 ఏళ్ల శ్రీలంక చరిత్రలో అధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోనుండటం ఇదే మొదటిసారి. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రణిల్ విక్రమసింఘే మాట్లాడారు. రేపటి నుంచి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ ఛాంబర్ వెలుపల తనను ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. రేపటి నుంచి అన్ని పార్టీలతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని చెప్పారు. 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధాని మంత్రిగా పనిచేశారు.
Sri lanka Presidential Election: నేడే శ్రీలంక అధ్యక్షుడి ఎన్నిక.. బరిలో ముగ్గురు
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగనున్నారు. లంక పార్లమెంటు కొత్తగా బాధ్యతలు చేపట్టే అధ్యక్షుడు రణిల్ 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు పోటీలో ఉన్నారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలహప్పెరుమాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఓవైపు అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్‌లో ఓటింగ్ జరుగుతున్న వేళ ప్రజలు శాంతియుత నిరసనలకు దిగారు. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా కొలంబోలోని అధ్యక్ష భవనం వద్ద నిరసనలు చేపట్టారు. అయితే.. ఎలాంటి అల్లర్లకు దారి తీయకుండా భవనం మెట్లపై కూర్చుని నినాదాలు చేశారు.