Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!

  • పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం
  • నిఘా వ్యవస్థలపై కీలక నిర్ణయం
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత మార్పులు
Putin

Putin

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ప్రపంచ దేశాల్లో భద్రతా వ్యవస్థలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహా దాడులు జరగవచ్చేమోనని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో భాగంగానే పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయనకు అత్యంత సన్నిహితుల భద్రత కోసం ఉపయోగించే ప్రత్యేక నిఘా కెమెరా వ్యవస్థలోని కొన్ని భాగాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఖమేనీ హతమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటన అనంతరం ఇలాంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి రష్యా నాయకులను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

×
×
Ad

మాస్కో నగరంలో ప్రజల పర్యవేక్షణ కోసం ఉపయోగించే దాదాపు 3 లక్షల కెమెరాల వ్యవస్థకు భిన్నంగా.. పుతిన్ భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా నెట్‌వర్క్‌ను తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంజినీర్లు ఆ వ్యవస్థను పూర్తిగా పరిశీలించి.. ఇంటర్నెట్‌తో ఉన్న అనుసంధానాలను పూర్తిగా వేరు చేసే ప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. భద్రతా తనిఖీలు పూర్తైన తర్వాతే ఆ నెట్‌వర్క్‌ను తిరిగి ప్రారంభించినట్లు తెలిసింది. ఇరాన్‌లో జరిగిన ఘటనల్లో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు అక్కడి నిఘా కెమెరా వ్యవస్థలను ఉపయోగించి కీలక అధికారుల కదలికలను గుర్తించాయని వచ్చిన నివేదికల నేపథ్యంలో రష్యా ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.

ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అభివృద్ధితో నిఘా వ్యవస్థలు మరింత శక్తివంతమైన గూఢచారి సాధనాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్దిష్ట సమాచారం కోసం మాత్రమే శోధన సాధ్యమయ్యేది. అయితే తాజా AI వ్యవస్థలు సహజ భాషలో ఇచ్చే ఆదేశాల ఆధారంగా లక్షల గంటల వీడియోలను వేగంగా విశ్లేషించి వ్యక్తుల ప్రవర్తన, కదలికలు, సమావేశాల వివరాలను గుర్తించగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నిఘా కెమెరా వ్యవస్థలు భద్రతకు ఉపయోగపడటంతో పాటు.. శత్రుదేశాల చేతుల్లో పడితే ప్రమాదకర ఆయుధాలుగా మారే అవకాశం ఉందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) హెచ్చరించినట్లు సమాచారం. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం తమ నిఘా వ్యవస్థల భద్రతను పునఃసమీక్షిస్తున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.