Jinping Russia Visit: ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆధిపత్యం రష్యా, చైనాలను మరింత దగ్గర చేస్తోంది. నాటోకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు మరో కూటమిని కట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో జపాన్ ప్రధాని కిషిడా ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోతున్న విషయం కనిపిస్తోంది. అయితే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా క్వాడ్, ఆకుస్ కూటమిలను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై చైనా, రష్యాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ రెండు కూటములు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను దెబ్బతీస్తోందని పుతిన్, జిన్ పింగ్ బుధవారం మాస్కోలో అన్నారు. అమెరికా వ్యూహానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత, సమాన, సమ్మిళిత భద్రతా వ్యవస్థను నిర్మిస్తామని ఇరు దేశాధినేతలు పునరుద్ఘాటించారు.
Read Also: Russia: పుతిన్‌ను విమర్శించిన పాప్‌స్టార్ మృతి
అయితే భారత్, అత్యంత మిత్రదేశంగా రష్యా ఉన్న సంగతి తెలిసిందే. కాగా చైనా, రష్యాలు వ్యతిరేకిస్తున్న క్వాడ్ కూటమిలో భారత్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇక ఆకుస్ కూటమిలో బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ రెండు కూటములు ప్రధాన లక్ష్యం చైనా ఆగడాలకు చెక్ పెట్టడమే. అయితే తాజా పర్యటనలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని జిన్ పింగ్ వెల్లడించారు.
అవకాశవాద పొత్తు: అమెరికా.
చైనా, రష్యాల పొత్తును అవకాశవాద పొత్తుగా అభివర్ణించింది అమెరికా. అమెరికా, నాటో ప్రభావాన్ని ఎదుర్కోవడానికే పుతిన్ ఉపయోగపడుతారని చైనా అధ్యక్షుడ జిన్ పింగ్ అనుకుంటున్నారని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కర్బీ బుధవారం అన్నారు. చైనా, రష్యాలు దగ్గరవుతున్న కూటమి కట్టలేదని, రెండు దేశాలు అవకాశవాద పొత్తును ఏర్పాటు చేసుకున్నాయని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో జిన్ పింగ్ మధ్యవర్తిత్వంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ యుద్ధాన్ని జిన్ పింగ్ ఖండించలేదని, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొంటూనే ఉన్నారని అలాంటప్పుడు నిష్పాక్షిక మధ్యవర్తిత్వం ఎలా వహిస్తారని ప్రశ్నించారు.