PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ సాయం కోరుతోంది ఉక్రెయిన్. మరోవైపు ప్రపంచదేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్ మాత్రం రష్యాతో ఉన్న స్నేహం కారణంగా, రష్యాతో సత్సంబంధాలు నడుపుతోంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. ఒక వేళ ఈ సమావేశం జరిగితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ సమావేశంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు.
Read Also: Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ , బ్రిటన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఏడాది ఈ కూటమికి జపాన్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. జపాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. మరోవైపు జపాన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించింది.
ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా గత నెలలో భారతదేశాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అధ్యక్షుడు జెలెన్స్కీతో చాలాసార్లు మాట్లాడారు. గతేడాది అక్టోబర్ 4న ప్రెసిడెంట్ జెలన్ స్కీతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.