ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగిసింది. బ్రిక్స్ సదస్సు కోసం రెండ్రోజుల పర్యటన కోసం మోడీ రష్యా వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో మోడీ పాల్గొని దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. బుధవారం పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ భారత్‌కు బయల్దేరారు. పర్యటనలో ఆయా దేశాధినేతలను కలుసుకున్నారు. ప్రధానంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది.
మోడీ ప్రసంగం..
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై బ్రిక్స్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టినట్లు గుర్తుచేశారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదని.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన మద్దతు అవసరమని.. ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదన్నారు. అలాగే గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ కోరారు.
ఇది కూడా చదవండి: Minister Lokesh: రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..