Hinglaj Mata festival: పాకిస్తాన్‌లో ఎంతో ప్రముఖమైన హిందూ ఆలయం “హింగ్లాజ్ మాత” మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ తీర్థయాత్రకు లక్షలాది హిందువులు హాజరవుతున్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న ఈ ఆలయానికి వెళ్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులోని హైదరాబాద్, కరాచీ ప్రాంతాల నుంచి హిందూ యాత్రికులు ఎక్కువగా ఈ తీర్థయాత్రకు హాజరవుతున్నారు. ఈ యాత్రకు వెళ్లే ముందు దారిలో ఉన్న ఓ మట్టి అగ్నిపర్వాతాన్ని అదిరోహించిన తర్వాత ఈ పవిత్రమైన తీర్థయాత్రను ప్రారంభిస్తారు.
Read Also: Kesineni Nani: పార్టీ లైన్‌లో గతంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశా..
నిటారుగా ఉన్న పర్వతం పైకి ఎక్కి అక్కడ కొబ్బరికాయల్ని, గులాబీ రేకులను ఉంచి, హింగ్లాజ్ మాతను సందర్శించేందుకు దైవ అనుమతిని కోరుతారు. హింగ్లాజ్ మాత వేడుకలు శుక్రవారంతో ప్రారంభమై ఆదివారంతో ముగుస్తున్నాయి. 1,00,000 మందికి పైగా హిందువులు పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ముస్లిం మెజారిటీ ఉన్న పాకిస్తాన్ దేశంలో 44 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే ఆ దేశ జనాభాలో కేవలం 2.14 శాతం మాత్రమే. దాంతప్య సౌభాగ్యం, దీర్ఘాయువుకి దేవత అయిన సతీదేవీ తన జీవితాన్ని ముగించిన తర్వాత భూమిపై వెలిసిన సతీదేవీ రూపంగా హింగ్లాజ్ మాతను హిందువులు ఆరాధిస్తారు. ఇది హిందూమతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి. మూడు రోజుల పాటు ఎవరైతే ఆలయాన్ని దర్శించి పూజిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.