Pakistan may lose major non-Nato ally status: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. తమను రక్షించాలని పాశ్చాత్య దేశాలను అడుక్కుంటోంది. అక్కడి ప్రజలు కనీసం గోధుమ పిండి కూడా దొరకడం లేదు. గోధుమ పిండి కోసం అక్కడ ప్రజలు కొట్లాడుతున్నారు. ఇక గత్యంతరం లేక ప్రస్తుతం భారత్ ను పొగుడుతోంది పాకిస్తాన్. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా తయారవుతోంది పాకిస్తాన్ పరిస్థితి. ఒకవైపు దేశంలో అశాంతి, అస్థిరత, ఆర్థిక సంక్షోభానికి తోడు అప్పు ఎక్కడా పుట్టడం లేదు. హిమాలయాల కన్నా ఎతైంది..సముద్రం కన్నా లోతైంది అంటూ చైనా స్నేహాన్ని కొనియాడే పాకిస్తాన్ కు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కూడా సహాయం చేయడం లేదు.
Read Also: D Raja: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి.. దేశాన్ని నాశనం చేస్తున్నాయి
దీనికి తోడు ప్రస్తుతం పాకిస్తాన్ కు అమెరికా షాక్ ఇవ్వబోతోంది. ఇన్నాళ్లు నాటోయేతర మిత్రదేశ హోదాను పొందుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఆ హోదా రద్దు చేయాలని యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అరిజోనా రాష్ట్రం ఐదవ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్ సభ్యుడు ఆండీ బిగ్స్ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అవసరమైన చర్యల కోసం బిల్లును హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీకి పంపారు. అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లుపై సంతకం చేసే ముందు దీనిని హౌస్ ఆఫ్ రిప్రజెంటీవ్స్, సెనెట్ ఆమోదించాలి.
నాటోయేతర ప్రధాన మిత్రదేశం హోదాను అనుభవిస్తున్న పాకిస్తాన్, యూఎస్ఏ నుంచి రక్షణ సామాగ్రి, పరిశోధన, అభివృద్ధి, రక్షణ పరికరాల సహకారం ఇతర విషయాల్లో అనేక ప్రోత్సహకాలను పొందుతోంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే.. పాకిస్తాన్ కు పెద్ద దెబ్బతగిలినట్లే అవుతుంది. నాటోయేతర మిత్రదేశంగా పాకిస్తాన్ ను కొనసాగించాలంటే హక్కానీ నెట్వర్క్ సీనియర్ ఉగ్రవాదులను, నాయకులను అరెస్ట్ చేసి విచారించే విషయంలో పాకిస్తాన్ పురోగతిని కనబరిచిందనే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని బిల్లులో యూఎస్ అధ్యక్షుడిని కోరింది. హక్కానీ నెట్వర్క్ కు పాకిస్తాన్ స్వర్గధామం కాదని నిరూపించుకునేలా నిబద్ధతను చాటాలని కోరింది.