Honour killing: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సుకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబాన్ని కాదని పెళ్లి చేసుకున్న ఒక యువ జంటను హత్య చేస్తున్న భయంకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక గుంపు కారులో రాష్ట్ర రాజధాని క్వెట్టా నుంచి వీరిద్దరిని నిర్జన ప్రాంతంలోకి తీసుకువచ్చినట్లు చూపిస్తోంది. అక్కడే సదరు యువతితో పాటు యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
ఆ మహిళకు శాలువాతో కప్పిన ఖురాన్‌ని అందిస్తున్నట్లు వీడియో ఉంది. జన సమూహం నుంచి ఆమె ఒక కొండ వైపు నడుస్తుంది. ఆమె మాట్లాడుతూ..‘‘ నాతో ఏడు అడుగులు నడవండి, ఆ తర్వాత నన్ను కాల్చవచ్చు’’ అని ఒక వ్యక్తితో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతదూరం నడిచిన తర్వాత ఆమెను వెనక నుంచి తుపాకీతో అతి సమీపం నుంచి కాలుస్తారు. ఆమె చనిపోయినట్లు వీడియోల స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఆ వ్యక్తితో ‘‘నీకు నన్ను కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు.’’ అని చెబుతుంది. అయితే, ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అస్పష్టంగా ఉంది.
Read Also: Health Tips: డ్రాగన్ ఫ్రూట్ వారికి ఓ వరం.. ప్రయోజనాలు తెలిస్తే ధర గురించి ఆలోచించరు!
ఆ మహిళ మృతదేహానికి సమీపంలోనే మరో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన మే నెలలో ఈద్ అల్-అధాకి మూడు రోజుల ముందు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, పాకిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో న్యాయం చేయాలని పలువురు పిలుపునిచ్చారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతులను ధిక్కరించే ధైర్యం చేసిన మహిళలను పాకిస్తాన్‌లో లక్ష్యంగా చేసుకుని, పరువు హత్యలకు పాల్పడుతున్నారు.
స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు మరియు ఆ జంటను బానో బీబీ,అహ్సాన్ ఉల్లాగా గుర్తించారు. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు. మహిళ తన అన్న అనుమతి లేకుండా వివాహం చేసుకోవడంతో, గిరిజన పెద్ద సర్దార్ సతక్జాయ్ ఆదేశం మేరకు ఈ జంటను హత్య చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) డేటా ప్రకారం, 2024లో దేశం కనీసం 405 పరువు హత్యలు జరిగాయి.
https://twitter.com/AgroXperts/status/1946986214730432825