Pakistan fears India may conduct another surgical strike: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 5 మంది సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో వచ్చే నెలలో భారత్ నిర్వహిస్తున్న జీ-20 సమావేశం ముందు భయోత్పాతాన్ని రేపేందుకు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ లోని పలువురు మాజీ అధికారులు, దౌత్యవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pakistan: పరువు కోసం పాక్ ఆర్మీ ప్రగల్భాలు.. భారత్‌పై దాడి చేయగలమంటూ బెదిరింపు..
తాజాగా పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. భారత్ మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ దాడి నిర్వహించే అవకాశం ఉందని భయపడుతున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయగలదని పాకిస్థాన్ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రజలు భారతదేశం మరోసారి సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానికి దాడుల గురించి మాట్లాడుతున్నారని.. అయితే ఈ ఏడాది భారత్ జీ-20, SCO సమావేశాలకు అధ్యక్షత వహిస్తోందని, ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ పై దాడులు చేయకపోవచ్చని, కానీ వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో భారతదేశం దాడులు చేసే అవకాశం ఉందని అబ్దుల్ బాసిత్ అన్నారు.
పూంచ్ ఉగ్రదాడి గురించి కూడా బాసిత్ మాట్లాడుతూ.. ముజాహిదీన్ లేదా ఎవరైనా సరే, వారు సైనికులను లక్ష్యంగా చేసుకున్నారని, పౌరులను కాదని చెప్పారు. మీరు ఉద్యమం చేస్తుంటే.. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారని, పౌరులను కాదని, అంతర్జాతీయ చట్టం దీనికి అనుమతిస్తుందని వ్యాఖ్యానించారు.