పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జాతీయ అసెంబ్లీలో ఆదివారం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. మరోవైపు తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.
జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. తనపై అవిశ్వాసం విదేశీ కుట్ర అని ఆరోపించారు. ఈ చర్య పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆయన అభివర్ణించారు. యావత్ దేశం గమనిస్తుండగానే కొందరు దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కాగా నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సూరీ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో ప్రతిపక్షాలు ధర్నాకు దిగాయి.
https://ntvtelugu.com/srilanka-crisis-ban-on-social-media/