Pakistan Airstrikes: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తూర్పు కాబూల్‌లోని టీటీపీ (తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్), అల్-ఖైదా సేఫ్‌హౌస్ నుంచి పని చేస్తున్న టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిగింది. నగరంపై వైమానిక దాడులు జరిగినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. దీనిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాబూల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది.. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదు అన్నారు. పేలుడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా, టీటీపీ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ అల్-ఖైదా కాబూల్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక సురక్షిత ప్రదేశంలో ఉన్నట్లు తెలిపాడు. ఈ దాడి తర్వాత మెహ్సూద్ పంపిన ఓ వాయిస్ లో తాను పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నానని, కానీ తన కుమారుడు ఈ దాడిలో మరణించాడని వెల్లడించాడు.
Read Also: Prakasam : ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. మెరుపు పిడుగుతో పొగాకు ఫ్యాక్టరీలో మంటలు
అయితే, పాకిస్తాన్ ఈ దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘన్ పౌరులు ఆరోపిస్తున్నారు. భారత్‌తో ఆఫ్ఘనిస్తాన్ దోస్తీని తట్టుకోలేకపోతున్న పాక్ — ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే కాబూల్‌లో ఈ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెహ్రీక్ ఈ తాలిబన్ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం. అర్థరాత్రి కాబూల్ నగరంపై బాంబుల వర్షం కురిసినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల ప్రతినిధుల భేటీతో పాకిస్తాన్ భయపడుతుంది. దీంతో విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఇలా కాబూల్ లో దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.