Pakistan: పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ బాలికను బలవంతంగా అపహరించి, మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కృషి చేయడం లేదు. పోలీసుల దగ్గర నుంచి కోర్టుల వరకు హిందువులకు న్యాయం దక్కడం లేదు.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సులో కిడ్నాప్ చేయబడి, ఇస్లాం మతంలోకి మార్చబడి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 14 ఏళ్ల బాలికను జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే తన తల్లిదండ్రులతో పంపాలని బాలిక కోర్టును వేడుకున్నా కూడా అక్కడి న్యాయస్థానం కనికరించలేదు. తల్లిదండ్రులతో పంపడానికి నిరాకరించింది. పెళ్లైన వ్యక్తితో వెళ్లాలని ఆదేశించింది. 14 ఏళ్ల బాలిక సోహనా శర్మ కుమారిని జూన్ 2న దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని బెనజీరాబాద్ జిల్లాలోని తన ఇంటి నుండి ఆమె తల్లి ఎదుట ఆమె ట్యూటర్, అతని సహచరులు తుపాకీతో కిడ్నాప్ చేశారు.
Read Also: Earthquake: ఫిజీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు
తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా తన మతం మార్చి, ముస్లిం వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారని కోర్టుకు బాలిక చెప్పినా పట్టించుకోలేదు. బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని, కూలీ పని చేస్తున్నాడని ఒక సందర్భంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తండ్రి తెలిపారు. ఈ బాలిక ఉదంతంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో పోలీసులు స్పందించి, బాలికను రెస్క్యూ చేశారు. ఈ కేసును కోర్టు జూన్ 12కు వాయిదా వేసింది. ఇస్లాంలో చేరి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దాఖలు చేసిన పత్రాలన్నీ నకిలివేనని బాలిక తండ్రి కోర్టుకు తెలిపారు.
ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో హిందూ బాలికలు, యువతలను కిడ్నాప్ చేస్తూ ఇస్లాంలోకి మార్చి, బలవంతంగా వారి కన్నా ఎంతో పెద్దవారైన ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అక్కడి పోలీసులు స్పందించపోవడంతో కిడ్నాప్ అయిన అమ్మాయిల ఆచూకీ లభించడం దాదాపుగా కష్టంగా మారింది. గత ఏడాది నుంచి షీలా మేఘ్వార్, చందా మహారాజ్, సిమ్రాన్ కుమారి, పూజా కుమారి, సత్రన్ ఓడ్, కవితా భీల్ , సోహనా అనే బాలికలు కిడ్నాప్ కు గురయ్యారు. వీరంతా తక్కువ వయసు ఉన్న బాలికలే. పాక్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.