Oxygen on Mars: అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది. తాజాగా ఈ రోవర్ లో ఓవెన్ పరిమాణంలో ఉన్న ఓ యంత్రం అంగారకుడిపై ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా అరుణ గ్రహంపై ప్రాణవాయువు ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది.
అంగారకుడిపై భవిష్యత్తులో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రయోగం దోహదపడతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్(MOXIE)’ అనే పరికరం ఆక్సిజన్ ని తయారుచేసి తన మిషన్ పూర్తి చేసింది. మైక్రో ఓవెన్ పరిమాణంలో ఉండే ఈ పరికరం 2021లో పర్సెవరెన్స్ రోవర్ ల్యాండైనప్పటి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. MOXIE ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసినట్లు నాసా తెలిపింది. ఇది నాసా అనుకున్న లక్ష్యం కన్నా రెండింతలు ఎక్కువ అని తెలిపింది. తయారు చేయబడిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా, మెరుగ్గా ఉన్నట్లు, ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని నాసా ప్రకటించింది.
Read Also: Rahul Gandhi: “ఉక్రెయిన్-రష్యా” వివాదంలో భారత్ వైఖరిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు..
మార్స్ పై అత్యంత పలుచని వాతావరణం ఉంది. భూమి మొత్తం బంజేరుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ లోని ప్రతీ అణువు నుంచి ఒక ఆక్సిజన్ అణువును వేరు చేయడానికి ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తూ MOXIE అనే పరికరం పనిచేస్తుంది. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆ వాయువును విశ్లేషిస్తుంటుంది. MOXIE సాధించిన విషయం భవిష్యత్తులో అంగారకుడిపై మానవ ఆవాసాల దిశగా ప్రోత్సహిస్తుంది.
సౌరకుటుంబంలో ఒక్క అంగారకుడు మాత్రమే భూమి లాగా ‘గోల్డెన్ లాక్ జోన్’లో ఉన్నాడు. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రత ఎక్కువ కాకుండా మరీ తక్కవ కాకుండా ఉండే ప్రాంతం. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడిపై ద్రవ స్థితిలో నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనికి అక్కడ ఉన్న లోయలు, ఎండి పోయిన నదీ ప్రవాహాల లాంటి గుర్తులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే కాలక్రమంలో భూమిలాగా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం, తగిన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో మార్స్ నీరును కోల్పోయిందనే వాదన ఉంది. నాసా ఇంతకుముందు క్యూరియాసిటీ, ఆపర్చునిటీ రోవర్లను అంగారకుడిపైకి పంపింది. ఇప్పుడు పంపిన పర్సెవరెన్స్ రోవర్ వీటన్నింటి కన్నా మోస్ట్ అడ్వాన్డుడ్ రోవర్.